
బ్లాక్‌బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు. తనదైన స్పీచ్‌లతో, కాంట్రవర్సీ కామెంట్లతో నిత్యం వార్తల్లో ఉండే ఆయన, ఇటీవల వరుసగా సినిమా ఈవెంట్లకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ సక్సెస్ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఇదే వేదికపై నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ బండ్ల గణేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఒక మేధావి సైలెంట్‌గా ఉంటే దేశానికి ఎంత ప్రమాదమో.. బండ్ల గణేష్ సినిమాలు తీయకపోతే ఇండస్ట్రీకి అంత ప్రమాదం” అంటూ చమత్కరించారు. ఆయన వెంటనే తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని కోరారు.
ఎస్కేఎన్ వ్యాఖ్యలకు బండ్ల గణేష్ అదే వేదికపై నుంచి అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు. తాను మళ్లీ నిర్మాణంలోకి రాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించి, అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన తన బ్రేక్‌పై స్పష్టతనిచ్చారు. “నేను ఫ్లాపులు ఇచ్చి ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోలేదు. ‘టెంపర్’ లాంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చి గర్వంగా బ్రేక్ తీసుకున్నాను” అంటూ తనదైన శైలిలో సమాధానమిచ్చారు.
“త్వరలోనే నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతాను” అని బండ్ల గణేష్ ధీమాగా ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కడున్న వారంతా హర్షం వ్యక్తం చేశారు.
మొత్తానికి, నిర్మాత ఎస్కేఎన్ కోరికను బండ్ల గణేష్ నిజం చేయబోతున్నారు. ఆయన నిర్మాణ సంస్థ నుంచి రాబోయే తదుపరి చిత్రం ఏంటి? ఆ హీరో ఎవరనేదానిపై ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.
