
ఆంధ్రప్రదేశ్: ఆర్థిక వ్యవస్థపై గత ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పటికీ భారం మోపుతున్నాయి. వైసీపీ అధినేత జగన్ హయాంలో తీసుకున్న భారీ అప్పుల వడ్డీ చెల్లింపులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారాయి. ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం, ఈ నెల నుంచి ప్రతి నెలా 312 కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో వస్తోంది.
మొత్తం రాష్ట్ర అప్పులు 4.23 లక్షల కోట్లకు చేరగా, అందులో 2.86 లక్షల కోట్లు జగన్ పాలనలోనే తీసుకున్నవని అధికారులు తెలిపారు. ఈ అప్పులు ప్రభుత్వ గ్యారెంటీల ఆధారంగా తీసుకోవడం వల్ల వాటి వడ్డీ నేరుగా రాష్ట్రంపై పడుతోంది. అదనంగా, మద్యం అమ్మకాలు, కార్పొరేషన్ల ద్వారా మరో మూడున్నర లక్షల కోట్లను తెచ్చారని సమాచారం.
ఈ పరిస్థితుల్లో ఏటా 3,600 కోట్ల వడ్డీని చెల్లించాల్సి రావడం ఆర్థిక శాఖను తికమక పెట్టింది. ప్రస్తుత బడ్జెట్‌లో వడ్డీల కోసం కేటాయించిన మొత్తం కేవలం 1,200 కోట్లు మాత్రమే కావడంతో, లోటు భర్తీ ఎలా చేయాలనే దానిపై మంత్రి పయ్యావుల కేశవ్ తర్జన భర్జన పడుతున్నారు.
వైసీపీ హయాంలో తీసుకున్న అప్పులు ఎక్కువగా అభివృద్ధి పనులకు కాకుండా సంక్షేమ పథకాలకే వెళ్ళాయి. ఫలితంగా ఆదాయం పెరగకపోవడంతో అప్పుల భారం మరింత పెరిగింది. ఎన్నికలకు ముందు ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసమే అప్పులు చేయడం పరిస్థితిని మరింత దిగజార్చింది.
ఇప్పుడీ భారీ వడ్డీ చెల్లింపులు చంద్రబాబు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలుగా మారాయి. అసలు అప్పు తీర్చడం ఒకవైపు, నెలవారీ వడ్డీని సమీకరించడం మరోవైపు ఆర్థిక వ్యూహంలో కీలక పాత్ర పోషించనుంది.