న్యూస్ డెస్క్: రంపచోడవరం ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి, మృతదేహాన్ని కుటుంబానికి డోర్ డెలివరీ చేసిన కేసు రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో గతంలో విచారణ ముగిసినప్పటికీ, బాధిత కుటుంబం నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పునర్విచారణను ఆదేశిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు తీర్పు వెలువరించింది.
ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్‌ను నియమించి, ఈ కేసును లోతుగా విచారించేందుకు సిద్ధమైంది. అయితే అనంతబాబు తరఫు న్యాయవాది హైకోర్టులో స్టే కోరగా, కోర్టు తిరస్కరించింది. ఈ కేసులో కుట్ర కోణం ఉన్నట్టు, మరింత లోతుగా దర్యాప్తు అవసరం ఉందని కోర్టు పేర్కొంది.
ఇదిలా ఉండగా, కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించింది. కేసును పారదర్శకంగా పరిశీలించేందుకు ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావును ప్రభుత్వం నియమించింది.
వైసీపీ హయాంలో తూతూ మంత్రంగా విచారణ జరిపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనంతబాబు ఒప్పుకున్నప్పటికీ, అసలు కారణాలపై ఇంకా స్పష్టత లేదని బాధితులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తాజా విచారణకు రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పుడు అనంతబాబు తప్పించుకునే అవకాశం లేకుండా కేసు మరింత లోతుగా సాగనుంది.