
న్యూస్ డెస్క్: ఉపరాష్ట్రపతి ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. విపక్ష ‘ఇండియా’ కూటమి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘాటైన విమర్శలు చేశారు.
ఢిల్లీలో జరిగిన మనోరమ న్యూస్ కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, సుదర్శన్ రెడ్డి తీర్పులు నక్సలిజానికి పరోక్షంగా ఊతమిచ్చాయని ఆరోపించారు.
“సల్వా జుడుం కేసులో ఆయన ఇచ్చిన తీర్పు వల్లే నక్సలిజం ఏళ్ల తరబడి కొనసాగింది. ఆ తీర్పు రాకపోతే 2020 నాటికే నక్సల్ సమస్య పూర్తిగా నిర్మూలించబడేది” అని అమిత్ షా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఎడమపక్షాల ఒత్తిడికి లోనై ఇలాంటి వ్యక్తిని అభ్యర్థిగా ఎంపిక చేసిందని ఆయన విమర్శించారు.
2005లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం గిరిజన యువతతో ‘సల్వా జుడుం’ పేరిట ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసింది. వీరికి ఆయుధాలు ఇచ్చి మావోయిస్టులపై పోరాటానికి సిద్ధం చేశారు. కానీ ఈ దళంపై మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ తర్వాత 2011లో జస్టిస్ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం, ఈ దళం రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చి రద్దు చేసింది.
అమిత్ షా వ్యాఖ్యలతో రాజకీయ చర్చలు మళ్లీ వేడెక్కాయి. ఒకవైపు ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డిని మద్దతుగా నిలబెడుతుంటే, మరోవైపు ఎన్డీఏ తమ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తోంది. తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు.
ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఇద్దరి పోటీ మరింత రసవత్తరంగా మారింది. సల్వా జుడుం తీర్పు వివాదం కారణంగా ఎన్నికల ప్రచారం కొత్త మలుపు తిరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.