
నందమూరి బాలకృష్ణ సినిమా అంటే సాధారణంగా మాస్ ఫ్యాక్షన్ కథలే కళ్ల ముందు కదులుతాయి. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘ఎన్.బి.కె 111’ సినిమా ఓపెనింగ్ వేడుకలో విడుదల చేసిన కాన్సెప్ట్ ఆర్ట్స్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేశాయి.
‘వీరసింహారెడ్డి’ లాంటి హిట్ ఇచ్చిన గోపీచంద్, ఈసారి బాలయ్యను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారు. సముద్రం, కోట గోడలు, యుద్ధ వాతావరణం చూస్తుంటే ఇదొక భారీ చారిత్రక అద్భుతంలా అనిపిస్తోంది.
ముఖ్యంగా పోస్టర్‌లో బాలకృష్ణ గెటప్ నెవర్ బిఫోర్ అనేలా ఉంది. ఒక యోధుడి విగ్రహం రూపంలో ఉన్న బాలయ్య, రెండు పదునైన వింతైన ఆయుధాలు పట్టుకుని యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు.
ఇది కేవలం మాస్ సినిమా మాత్రమే కాదు, ఒక “హిస్టారికల్ రోర్” అని దర్శకుడు గోపీచంద్ చెప్పిన మాట అక్షరాలా నిజం అనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో మరో రాజసం ఉట్టిపడే విగ్రహం ఉండటం డ్యూయల్ రోల్ అయ్యి ఉండొచ్చనే ఊహాగానాలకు తావిస్తోంది.
వృద్ది సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. దర్శకుడు తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేస్తున్న సాహసం ఇది.
ఈ ఓపెనింగ్‌తోనే సినిమాపై అంచనాలు పీక్స్ కు వెళ్లాయి. రెగ్యులర్ కథలు కాకుండా, బాలయ్య బాబు ఇలాంటి వార్ డ్రామాని ఎంచుకోవడం ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇస్తోంది.
