‘రేసు గుర్రం’ చిత్రంలో తన నటనతో తెలుగువారికి దగ్గరైన నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్‌కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి హత్యా బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఆయన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున స్టార్ క్యాంపెయినర్‌గా చురుగ్గా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ బెదిరింపు కాల్ నేరుగా రవికిషన్‌కు కాకుండా, ఆయన జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి మొబైల్ ఫోన్‌కు వచ్చింది. కాల్ చేసిన వ్యక్తి, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినని పరిచయం చేసుకుని, “రవికిషన్‌ను తాము చూసుకుంటాం” అని హెచ్చరించాడు.
ఈ బెదిరింపు కాల్‌లో దుండగులు ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్లను కూడా ప్రస్తావిస్తూ, “ఈసారి వారు కూడా పోతారు” అని అన్నట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం మరింత సీరియస్‌గా మారింది.
జ్యోతిష్కుడు ప్రవీణ్ శాస్త్రి వెంటనే రామ్‌గఢ్ తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, ఈ బెదిరింపు తీవ్రతను అంచనా వేయడానికి దర్యాప్తు ప్రారంభించారు. రవికిషన్‌కు భద్రత పెంచాలని ఆయన అభిమానులు, బీజేపీ నేతలు కోరుతున్నారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ గతంలో కాంగ్రెస్ నేత బాబా సిద్ధిఖీని దారుణంగా కాల్చి చంపడం, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని పదేపదే హెచ్చరించడం తెలిసిందే. ఇప్పుడు మరో నటుడు-రాజకీయవేత్తను టార్గెట్ చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
