
న్యూస్ డెస్క్: ఏటీఎంలలో రూ.100, రూ.200 నోట్లు దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులు, వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు తప్పనిసరిగా చిన్న నోట్లను అందుబాటులో ఉంచాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల చిన్న లావాదేవీలకు సైతం సులభంగా నగదు లభించనుంది.
ఇప్పటివరకు చిన్న నోట్ల లేమితో చాలామంది యూపీఐపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో సాధారణ ప్రజలు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ఆర్బీఐ, చిల్లర నోట్ల కొరతను తగ్గించేందుకు కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.
ఆర్బీఐ ఆదేశాల ప్రకారం, ప్రతి ఏటీఎంలో కనీసం ఒక క్యాసెట్‌ను రూ.100 లేదా రూ.200 నోట్ల కోసం కేటాయించాలి. ఈ నిబంధన దశలవారీగా అమల్లోకి వస్తుంది. 2025 సెప్టెంబర్ 30 నాటికి దేశవ్యాప్తంగా 75 శాతం ఏటీఎంలలో, 2026 మార్చి 31 నాటికి 90 శాతం ఏటీఎంలలో చిన్న నోట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి.
కొత్త యంత్రాలు కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఉన్న యంత్రాల్లో చిన్న మార్పులు చేస్తే సరిపోతుందని తెలిపింది. ఈ ఆదేశాలతో ఇకపై ఏటీఎంలలో చిన్న నోట్ల లభ్యత గణనీయంగా పెరగనుంది.