
న్యూస్ డెస్క్: చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీకి గట్టి దెబ్బ తగిలింది. ప్రముఖ టెక్ దిగ్గజాలైన యాపిల్, శాంసంగ్ తమ ప్రీమియం ఫోన్లను పోల్చుతూ, ఎగతాళి చేసే విధంగా ప్రచారం చేసినందుకు లీగల్ నోటీసులు పంపాయి. తమ బ్రాండ్ ప్రతిష్ఠ దెబ్బతినేలా ఉన్న ఈ యాడ్స్‌ను వెంటనే నిలిపేయాలని స్పష్టంగా పేర్కొన్నాయి.
ఇటీవల షియోమీ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ “షియోమీ 15 అల్ట్రా” ప్రచారంలో భాగంగా ఐఫోన్ 16 ప్రో మాక్స్ కెమెరాను లక్ష్యంగా చేసుకుని ఎగతాళి చేసింది. ఏప్రిల్ ఫూల్స్ డే రోజున పత్రికల్లో పూర్తి పేజీ ప్రకటన ఇచ్చి, ఐఫోన్ కెమెరా తమ ఫోన్‌కు సరిపోదంటూ వ్యాఖ్యానించింది. అలాగే శాంసంగ్ ప్రీమియం ఫోన్లను ఉద్దేశించి కూడా ఇలాంటి పబ్లిసిటీ కొనసాగించింది.
ఈ చర్యలు వ్యాపార పోటీ పరిధిని మించి, ప్రత్యర్థి కంపెనీల ఇమేజ్‌ను దెబ్బతీసేలా ఉన్నాయని యాపిల్, శాంసంగ్ వాదిస్తున్నాయి. పోటీదారుల పేర్లను నేరుగా వాడటం ‘యాంబుష్ మార్కెటింగ్’ కిందకే వస్తుందని లీగల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భారత మార్కెట్లో బడ్జెట్ బ్రాండ్‌గా నిలిచిన షియోమీ, ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఈ లీగల్ నోటీసులు ఆ ప్రయత్నాలపై ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
ఇక 2025 రెండో త్రైమాసికానికి సంబంధించిన ఐడీసీ రిపోర్టు ప్రకారం, శాంసంగ్ 14.5% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉండగా, షియోమీ 9.6% వాటాతో రెండో స్థానంలో ఉంది. యాపిల్ 7.5% వాటాతో మూడో స్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో షియోమీ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.
