
న్యూస్ డెస్క్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు వరద ప్రభావిత ప్రాంతాలపై ఏరియల్ సర్వే నిర్వహించారు. హెలికాప్టర్ ద్వారా పలు జిల్లాల పరిస్థితులను స్వయంగా పరిశీలించి, నష్టాన్ని అంచనా వేశారు. అనంతరం ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించి వరద ప్రవాహాన్ని సమీక్షించారు.
గోదావరి నది నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో భద్రాచలం పరిసర ప్రాంతాలు మరింత ప్రమాదంలో ఉన్నాయని అధికారులు హెచ్చరించారు. బుధవారం వరకు నీటిమట్టం తగ్గినా, గురువారం ఉదయం మళ్లీ పెరిగింది. ఉదయం 10 గంటలకు గోదావరి నీటిమట్టం 37 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహం కారణంగా ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
చర్ల మండలంలోని తాలిపేరు జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో సమీప గ్రామాలకు అధికారులు అలర్ట్ జారీ చేసి, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పలు గ్రామాలు ఇప్పటికే నీటిలో మునిగిపోయి, రవాణా అంతరాయం ఏర్పడింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి, చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. హెలికాప్టర్‌ల సహాయంతో ఆహారం, త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణ భద్రతే ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేశారు. అవసరమైతే అదనపు బృందాలను పంపించి సహాయక చర్యలను వేగవంతం చేయాలని సూచించారు.
