
న్యూస్ డెస్క్: వన్డే క్రికెట్‌లో ఇప్పటివరకు పదమూడు మంది బ్యాట్స్‌మెన్ మాత్రమే హ్యాట్రిక్ సెంచరీలు చేశారు. ఆ రికార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయుడు విరాట్ కోహ్లి. 2018లో అతడు హ్యాట్రిక్ సెంచరీలు కొట్టాడు.
ఇప్పుడు కోహ్లి డబుల్ హ్యాట్రిక్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గా నిలిచే అరుదైన రికార్డు ముంగిట ఉన్నాడు. దీనికి వేదిక మన విశాఖపట్నం కానుండడం ప్రత్యేకంగా నిలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో శనివారం విశాఖలో జరగనున్న మూడో వన్డే సిరీస్ విజేతను తేల్చేది కావడంతో మరింత ఉత్కంఠగా మారింది.
ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో 135, రెండో మ్యాచ్‌లో 102 పరుగులతో కోహ్లి సెంచరీలు కొట్టాడు. బ్యాటింగ్ కు అనుకూలించే విశాఖ పిచ్‌పై కోహ్లి చెలరేగడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. పైగా గత రెండు మ్యాచ్‌ల తరహాలో విశాఖలో రాత్రి పూట మంచు ప్రభావం ఉండదు.
విశాఖలో కోహ్లి రికార్డు అద్భుతంగా ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో 587 పరుగులు చేసి, యావరేజ్ 97పైనే ఉంది. మూడు సెంచరీలు రెండు హాఫ్ సెంచరీలు చేశాడు.
కోహ్లి హ్యాట్రిక్ సెంచరీ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. దీంతో విశాఖ క్రికెట్ స్డేడియంలో శనివారం జరిగే మ్యాచ్ టికెట్లు హాట్ కేక్ ల తరహాలో అమ్ముడవుతున్నాయని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. కోహ్లి సెంచరీల తర్వాత టికెట్ల అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి.
