
న్యూస్ డెస్క్: పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ ఆఫ్రిది (16 ఏళ్లు), హసన్ రజా (14 ఏళ్లు) చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చారు. వీరిద్దరి వయసుపైనా అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. ఈ రికార్డులున్న పాకిస్థాన్ అభిమానులు ఇప్పుడు భారత్‌కు చెందిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ఏజ్ ఫ్రాడ్ అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆసియా కప్ అండర్ 19 టోర్నీలో యువ భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా ఆడుతున్నాడు. మొన్నటి మ్యాచ్‌లో యూఏఈపై 171 పరుగులు, మంగళవారం మలేసియాపై 26 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. టీమ్ ఇండియాలోకి అతడిని తీసుకోవాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైభవ్ పై పాకిస్థాన్ అభిమానులు ఏడుపు లంకించుకున్నారు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాక్ అభిమానులు బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న వైభవ్‌ను ఉద్దేశించి “చిన్న పిల్లాడిలా లేవు.. 30 ఏళ్ల వాడిలా కనిపిస్తున్నావ్”, “మూడేళ్లుగా 14 ఏళ్లే అంటున్నావ్” అంటూ అవాకులు చెవాకులు పేలారు. వైభవ్‌ను ఛీటర్ అంటూ అవమానించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అయితే, వైభవ్ వయసుపై ఎలాంటి అనుమానాలు లేవని బీసీసీఐ ఇప్పటికే ధ్రువీకరించింది. బిహార్‌కు చెందిన ఇతడు చిన్న వయసులోనే బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కేవలం 35 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. వైభవ్ కచ్చితమైన వయసును బీసీసీఐ నిర్ధారించింది.
