
న్యూస్ డెస్క్: మరో రెండు వారాల్లో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. అయితే, కొత్త ఏడాదిలో టీవీల ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఫారెక్స్ మార్కెట్‌లో రూపాయి పతనం, మెమరీ చిప్‌ల కొరత వంటి కారణాలతో జనవరి 2026 నుంచి టీవీల ధరలు మూడు నుంచి నాలుగు శాతం వరకు పెరగవచ్చని స్పష్టం చేస్తున్నారు.
ధరల పెంపునకు కారణాలు:
- రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.90ను దాటేయడం జరిగింది. టీవీల తయారీలో ఉపయోగించే ఓపెన్ సెల్, సెమీ కండక్టర్ చిప్‌లు, మదర్ బోర్డులు వంటి వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. రూపాయి పతనం కారణంగా దిగుమతి భారం పడుతుంది.
- మెమరీ చిప్‌ల కొరత: ఏఐ (AI) సర్వర్‌లకు హై బ్యాండ్ విడ్త్ మెమరీ చిప్‌ల డిమాండ్ భారీగా పెరిగింది. తయారీదారులు అధిక లాభాలు ఉండడం వలన ఆ తరహా చిప్ తయారీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీంతో, టీవీల తయారీలో ఉపయోగించే లెగసీ డివైస్‌ల సరఫరా తగ్గినట్లుగా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
- పెరిగిన చిప్ ధరలు: గడిచిన మూడేళ్లలో మెమరీ చిప్‌ల ధర ఏకంగా 500 శాతం మేర పెరిగినట్లుగా థామ్సన్, కోడక్ వంటి టీవీల తయారీ లైసెన్సు ఉన్న సూపర్ ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెలిపింది.
ఈ పరిణామాల కారణంగా కనిష్ఠంగా మూడు శాతం నుంచి గరిష్ఠంగా 10 శాతం వరకు టీవీల ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాబోయే ఆరు నెలల్లో చిప్‌ల ధరలు పెరుగుతూనే ఉంటాయని, దాని ప్రభావం టీవీ ధరల మీద ఉంటుందని చెబుతున్నారు.
కొత్త టీవీ కొనే ఆలోచన ఉన్నవారు, ధరల పెంపును నివారించుకోవాలంటే కొత్త ఏడాదికి ముందే కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
