
న్యూస్ డెస్క్: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఏ1గా ఉన్న సునీల్ కుమార్ ను ప్రశ్నించేందుకు దర్యాప్తు అధికారి నోటీసులు జారీ చేశారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సునీల్ కుమార్ విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
2021లో అప్పటి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ రఘురామపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. రఘురామ పుట్టినరోజు నాడే అరెస్టు చేసి, కస్టడీలో హింసించారని ఫిర్యాదు ఉంది. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చాక రఘురామ ఫిర్యాదు చేశారు. సునీల్ కుమార్ తోపాటు మాజీ సీఎం జగన్, పీఎస్ఆర్ ఆంజనేయులు వంటి వారు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు.
ఈ కేసులో ఇప్పటికే రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ డాక్టర్ ప్రభావతిని పోలీసులు అరెస్టు చేశారు. ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సునీల్ కుమార్ పై అప్పటి ప్రభుత్వ పెద్దల ప్రోద్బలంతోనే కస్టోడియల్ టార్చర్, భౌతిక దాడి జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.
రఘురామపై భౌతిక దాడి జరిగిందని అప్పట్లో సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రి డాక్టర్లు కోర్టు ఆదేశాలతో పరీక్షించి నివేదిక సమర్పించారు. లాఠీలు రబ్బరు బెల్టులతో దాడి జరిగిందని ఆ నివేదికలో నిర్ధారించారు. ఈ ఆర్మీ ఆసుపత్రి నివేదిక ప్రస్తుత కేసులో కీలకంగా మారింది.
ఈ కీలక మలుపు నేపథ్యంలో, డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేస్తారా అనే అంశంపై తీవ్ర చర్చ ఉత్కంఠ కొనసాగుతోంది.
