
న్యూస్ డెస్క్: తెలంగాణలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఆదివారం రెండో దశ పోలింగ్ కౌంటింగ్ పూర్తయింది. తొలి దశలో స్పష్టమైన ఆధిక్యత చూపించిన అధికార కాంగ్రెస్, రెండో దశలోనూ అదే ఊపును కొనసాగించింది. పార్టీ గుర్తులకు భిన్నంగా పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు. రెండో విడతలో 85.86 శాతం పోలింగ్ నమోదైంది.
రెండు దశల ఫలితాల సారాంశం:
- కాంగ్రెస్: మొదటి దశలో 2426 స్థానాలు గెలుచుకోగా, రెండో దశలో 2331 చోట్ల విజయం సాధించింది.
- బీఆర్ఎస్: తొలి దశలో 1155 సీట్లు సాధించగా, రెండో దశలో కొద్దిగా మెరుగుపడి 1195 స్థానాలు గెలుచుకుంది.
- బీజేపీ: తొలి దశ కంటే రెండో దశలో ఎక్కువ స్థానాలు సాధించింది. సీపీఐ, సీపీఎంలు కూడా అదే తీరును ప్రదర్శించాయి.
- ఇండిపెండెంట్లు: రెండు దశల్లోనూ ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎక్కువగా విజయం సాధించడం గమనార్హం.
మొదటి దశలో 4230 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, రెండో దశలో 4332 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండు దశల ఫలితాలను విశ్లేషిస్తే, కాంగ్రెస్ సగానికి పైగా సీట్లను గెలుచుకోగా, బీఆర్ఎస్ 25 శాతానికి పైగా స్థానాల్లో విజయం సాధించింది.
కొన్ని ఆసక్తికర పరిణామాలు:
- తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ వెనుకబడగా, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ టాప్ గేర్‌లో నిలిచింది.
- బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ తన ఆధిక్యతను ప్రదర్శించింది.
- ఓట్ల లెక్కింపులో ఉత్కంఠ పోరు నెలకొన్న తొమ్మిది చోట్ల ఒక్క ఓటు తేడాతో అభ్యర్థులు విజయం సాధించారు.
- ఓటమిని భరించలేని ఒక అభ్యర్థి గుండెపోటుతో మరణించడం విషాదం.
- కుటుంబ పోరులు: మెదక్ జిల్లాలోని ఝూన్సీ లింగాపూర్ సర్పంచ్ స్థానానికి తండ్రీ కొడుకులు పోటీ పడగా, కాంగ్రెస్ మద్దతుతో బరిలో దిగిన తండ్రి విజయం సాధించారు. మహబూబాబాద్ జిల్లాలో అన్నాచెల్లెళ్లు పోటీ చేయగా అన్న గెలిచాడు. ఖమ్మం జిల్లాలో అక్కాచెల్లెళ్లు పోటీ పడగా అక్క విజయం సాధించింది. జగిత్యాల జిల్లాలో కోడలి మీద మామ గెలిచారు.
