Friday, January 16, 2026
HomeAndhra Pradeshగుంటూరులో అంబటి ఉండవల్లి టూర్.. మ్యాటరేంటి?

గుంటూరులో అంబటి ఉండవల్లి టూర్.. మ్యాటరేంటి?

guntur-ambati-rambabu-undavalli-arun-kumar-meeting-ysrcp-entry-speculation

న్యూస్ డెస్క్: వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా గుంటూరులో కలిసి టూర్ చేశారు. వైఎస్సార్ అంటే భక్తితో కూడిన ఆరాధనాభావం ఉన్న నాయకుడిగా అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. జగన్ వెంటనే ఉంటూ, పార్టీ కోసం పనిచేసే విధేయతకు మారు పేరుగా అంబటిని చెప్పుకుంటారు. ఇక, ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయాలు వదిలేశానని చెప్పినా, రాజకీయ విశ్లేషణలు చేస్తూనే ఉంటారు. ఆయన వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు.

అంబటి ఉండవల్లి ఇద్దరూ వైఎస్సార్ అంటే ఇష్టం ఉన్న సమకాలీకులు. ఈ ఇద్దరి మధ్య మంచి అనుబంధం అభిమానం ఉంది. ఇద్దరూ మంచి మాటకారులే, మీడియా ముందుకు వస్తే గట్టిగా మాట్లాడుతారు. అంతేకాక ఇద్దరూ న్యాయవాదులే.

గుంటూరు టూర్ కబుర్లు:

తాజాగా ఈ ఇద్దరు నేతలు గుంటూరులో ఒకే కారులో తిరిగారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. అంతేకాదు, ఇద్దరూ కలిసి సీనియర్ నాయకులను కలుసుకున్నారు. మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్లి పలకరించి మాట్లాడారు. అలాగే రైతు ఉద్యమ నాయకుడు మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ ఇంటికి వెళ్లి కబుర్లు ఆడుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు కలియతిరిగారు.

ఈ వివరాలన్నీ అంబటి రాంబాబు ఒక వీడియో బైట్ రూపంలో మీడియాకు వదిలారు. తాను ఉండవల్లి ఒక రోజంతా గుంటూరులో గడిపామని చెప్పారు. ఉండవల్లిది తనది రాజకీయంగా ఒకే దారి అయిన కాంగ్రెస్ దారి అని, ఆ తర్వాత తాను వైసీపీలోకి వచ్చానని, ఉండవల్లి మాత్రం రాజకీయాల నుంచి విరమించుకున్నారని చెప్పారు. ఉండవల్లిని నిజాయతీపరుడు అయిన నేతగా కొనియాడారు. ఇద్దరు మిత్రులు పాత ముచ్చట్లు నెమరువేసుకున్నామని అంబటి తెలిపారు.

వైసీపీలోకి ఉండవల్లి?

అంబటి ఉండవల్లి భేటీ కావడంతో, ఉండవల్లి వైసీపీలోకి వచ్చేసినట్లే అనే ప్రచారం ప్రస్తుతం ఉంది. అయితే, ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన పర్సనల్ భేటీ అని అంబటి రాంబాబు చెబుతున్నారు. పైగా ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరను అని ఎంతో కాలం నుంచి చెబుతున్నారు. కాబట్టి ఇది ఇద్దరు మిత్రుల భేటీగానే చూడాలి తప్ప మరేమీ కాదని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular