
తెలంగాణ: రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై విచారణకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఎట్టకేలకు అనుమతి ఇచ్చారు. ఫార్ములా ఈ-కార్ రేసు వ్యవహారంలో ఆయనపై ప్రాసిక్యూషన్ కోసం ఏసీబీ పంపిన ఫైలుకు గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ-రేస్ నిర్వహణలో సుమారు రూ. 55 కోట్ల మేర అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాలతోనే నిధులు దారి మళ్లాయని ఏసీబీ భావిస్తోంది. దీనిపై విచారణ జరిపేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వం ఎప్పుడో గవర్నర్‌కు లేఖ రాసింది.
ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఇదే అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడిచింది. కేటీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని బీజేపీ ప్రశ్నించగా, గవర్నర్ నుంచి అనుమతి రాలేదని కాంగ్రెస్ బదులిచ్చింది. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన వారానికే గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం గమనార్హం.
అధికారుల విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశీ సంస్థలకు నిధులు బదిలీ చేసే విషయంలో ఎలాంటి అధికారిక నోట్ ఫైల్స్ లేవని, కేవలం గత ప్రభుత్వ పెద్దల మౌఖిక ఆదేశాలతోనే చెల్లింపులు జరిగాయని అధికారులు చెబుతున్నారు. ఇదే ఇప్పుడు కేటీఆర్‌కు ఉచ్చు బిగుసుకునేలా చేస్తోంది.
మరోవైపు కేటీఆర్ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ విచారణకు హాజరైన ఆయన, ఇందులో ఎలాంటి తప్పు జరగలేదని వాదిస్తున్నారు. గవర్నర్ అనుమతితో ఏసీబీ ఇప్పుడు చార్జిషీట్ దాఖలు చేసేందుకు రెడీ అవుతుండటంతో, తదుపరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది.
