
అంతర్జాతీయ మీడియాలో బాబు, లోకేశ్.. ఒక్క డీల్ తో సీన్ రివర్స్!
న్యూస్ డెస్క్: సాధారణంగా బ్లూమ్‌బెర్గ్, రాయిటర్స్ వంటి టాప్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు దేశాధినేతలు, ప్రధానుల గురించి కథనాలు రాస్తుంటాయి. కానీ, అనూహ్యంగా ఒక భారతీయ రాష్ట్రానికి చెందిన సీఎం, మంత్రి గురించి ప్రత్యేక ఆర్టికల్స్ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పనితీరుపై ఈ సంస్థలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం ఏపీకి వస్తున్న భారీ పెట్టుబడులే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 18 నెలల్లోనే దాదాపు 120 బిలియన్ డాలర్లు (రూ. 10 లక్షల కోట్లు) పెట్టుబడులు వచ్చాయి. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ కాదు, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అనే కొత్త నినాదంతో అనుమతులు వేగంగా ఇస్తుండటమే దీనికి సీక్రెట్ అని విశ్లేషకులు అంటున్నారు.
ముఖ్యంగా గూగుల్ వంటి దిగ్గజ సంస్థ విశాఖలో డేటా సెంటర్ పెట్టేందుకు ముందుకు రావడంలో లోకేశ్ పాత్రను ‘రాయిటర్స్’ హైలైట్ చేసింది. 42 ఏళ్ల ఈ స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్.. గూగుల్ ప్రతినిధులకు ఉన్న డేటా సెక్యూరిటీ, పన్ను సందేహాలను తీర్చడానికి నేరుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి క్లియరెన్స్ తెచ్చారని కొనియాడింది. అర్సెలర్ మిట్టల్ ప్లాంట్ విషయంలోనూ లోకేశ్ వేగాన్ని మెచ్చుకుంది.
మరోవైపు ‘బ్లూమ్‌బెర్గ్’ చంద్రబాబు విజన్‌ను ఆకాశానికెత్తింది. ఇటీవలే జరిగిన సీఐఐ సదస్సులో రూ. 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరగడాన్ని ప్రస్తావిస్తూ.. గూగుల్‌తోనే ఆగిపోను, రాష్ట్రాన్ని క్వాంటం కంప్యూటింగ్‌కు హబ్‌గా మారుస్తానన్న చంద్రబాబు కాన్ఫిడెన్స్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించింది.
తమపై అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న ఈ కథనాలపై మంత్రి లోకేశ్ సంతోషం వ్యక్తం చేశారు. తాము తీసుకుంటున్న నిర్ణయాల్లో వేగం, పారదర్శకతే ఇందుకు కారణమని ట్వీట్ చేశారు. తండ్రీకొడుకుల చొరవతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ ఇప్పుడు గ్లోబల్ స్థాయికి చేరిందని చెప్పక తప్పదు.
