
న్యూస్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది. నాలుగేళ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికే పేరుతో ట్రంప్ ఒక వివాదాస్పద ‘శాంతి ఒప్పందానికి’ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది పరోక్షంగా ఉక్రెయిన్ పీక నొక్కి, రష్యా అధ్యక్షుడు పుతిన్కు మేలు చేసేలా ఉందన్న విమర్శలు వస్తున్నాయి.
ఈ ఒప్పందం ప్రకారం, ఉక్రెయిన్లోని అత్యంత సంపన్నమైన, పారిశ్రామిక ప్రాంతం ‘డాన్ బాస్’ (డొనెట్స్క్, లుగాన్స్క్) పూర్తిగా రష్యా పరమవుతుంది. ఇప్పటికే ఈ ప్రాంతాలపై పట్టు సాధించిన పుతిన్కు ఇది ఒక అధికారిక ఆమోదం లాంటిది. సహజ వనరులు పుష్కలంగా ఉండే ఈ ప్రాంతాన్ని కోల్పోవడం ఉక్రెయిన్కు ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ.
ఈ డీల్లోని నిబంధనలు ఉక్రెయిన్ను నిస్సహాయ స్థితిలోకి నెట్టేలా ఉన్నాయి. ఉక్రెయిన్ తన సైనిక బలగాలను సగానికి తగ్గించుకోవాలి. నాటో దళాలు దేశంలో ఉండకూడదు. అలాగే, రష్యాపై దాడి చేయగలిగే దీర్ఘ శ్రేణి ఆయుధాలను ఎవరూ ఉక్రెయిన్కు ఇవ్వకూడదు. అమెరికా సైనిక సాయం కూడా బంద్ అవుతుంది.
రష్యా, అమెరికా అధికారులు కలిసి రూపొందించిన ఈ 28 అంశాల ఒప్పందాన్ని జెలెన్స్కీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన సలహాదారులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, అంతర్గత రాజకీయాల వల్ల జెలెన్స్కీ వాయిస్ వీక్ అయ్యింది. ఇదే అదనుగా ట్రంప్ ఈ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
మొత్తం మీద ఈ ఒప్పందం అమలైతే ఉక్రెయిన్ సార్వభౌమత్వానికి గండి పడినట్లే. “శాంతి” పేరుతో ట్రంప్ ఉక్రెయిన్ను బలిపశువును చేశారని, రష్యా కోరుకున్నది ప్లేట్లో పెట్టి ఇచ్చారని అంతర్జాతీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక డాన్ బాస్ చేజారితే ఉక్రెయిన్ భవిష్యత్తు అగమ్యగోచరమే.
