
న్యూస్ డెస్క్: టీమిండియాను ఒకప్పుడు ధోని, రోహిత్ శర్మ లాంటి నాయకులు ముందుండి నడిపించేవారు. తమ బ్యాటింగ్ తో జట్టుకు విజయాలు అందించేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. ప్రస్తుత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ వరుస వైఫల్యాలతో జట్టుకు భారంగా మారుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా సూర్యకుమార్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత 23 ఇన్నింగ్స్ ల్లో కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశారు. కెప్టెన్ గా ఉండి ఇలాంటి ప్రదర్శన చేయడం ఏంటని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఒకటి రెండు మెరుపులు తప్ప, కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంలో సూర్య పూర్తిగా విఫలమవుతున్నాడు.
ఇక వైస్ కెప్టెన్ గిల్ పరిస్థితి కూడా అంత గొప్పగా ఏం లేదు. గత 15 మ్యాచ్ ల్లో నిలకడ లేని ఆటతీరుతో నిరాశపరుస్తున్నాడు. సూర్య కంటే కొంచెం బెటర్ అనిపించినా, వైస్ కెప్టెన్ రేంజ్ ఆట మాత్రం కాదనేది వాస్తవం. ఇద్దరు కీలక ఆటగాళ్లు ఇలా ఆడటం భవిష్యత్తులో టీమ్ కు దెబ్బే.
ప్రస్తుతం టీమిండియా గెలుస్తోందంటే అది కేవలం మిగతా యువ ఆటగాళ్లు, ఆల్ రౌండర్ల చలవే. వారి పోరాటం వల్ల వీరి వైఫల్యాలు పెద్దగా బయటపడటం లేదు. గెలుపు మత్తులో ఈ లోపాలు కవర్ అయిపోతున్నాయి తప్ప, వ్యక్తిగతంగా వీరిద్దరూ నిరాశపరుస్తూనే ఉన్నారు.
ఇప్పటికైనా వీరిద్దరూ బ్యాట్ ఝుళిపించకపోతే కష్టమే. రాబోయే సిరీస్ ల్లో ఈ వైఫల్యాలే జట్టుకు పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా వీరిద్దరూ ఫామ్ లోకి వచ్చి బాధ్యతాయుతమైన స్కోర్లు సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
