
న్యూస్ డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో రచ్చకెక్కే హెచ్‌సీఏ, ఈసారి చిన్న పిల్లల పట్ల చూపించిన నిర్లక్ష్యం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
అండర్-14 క్రికెట్ సెలక్షన్స్ కోసం జింఖానా గ్రౌండ్ కు వచ్చిన చిన్నారులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్లేయర్స్ ను గంటల తరబడి రోడ్డుపైనే నిలబెట్టారు.
ఎండ తీవ్రతను కూడా పట్టించుకోకుండా చిన్నారులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. గ్రౌండ్ బయట ట్రాఫిక్ రణగొణ ధ్వనుల మధ్య వారు పడ్డ ఇబ్బందులకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భవిష్యత్ క్రికెటర్ల పట్ల ఇంత బాధ్యతారహితంగా ఉంటారా అని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. క్రికెట్ అభివృద్ధిని గాలికి వదిలేసి, రాజకీయాలు చేస్తున్నారని క్రీడాభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ హెచ్‌సీఏపై అవినీతి ఆరోపణలు, సన్ రైజర్స్ తో విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. నిర్వహణ లోపాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అసోసియేషన్ తీరు ఏమాత్రం మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి చిన్నారులకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై హెచ్‌సీఏ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
