
న్యూస్ డెస్క్: వాహన రంగంలో అగ్రగామి టాటా మోటార్స్‌ను రెండు భాగాలుగా విడగొట్టే ప్రక్రియకు కంపెనీ తుది ముహూర్తం పెట్టింది. ఇకపై టాటా మోటార్స్ వాణిజ్య వాహన వ్యాపారం, ప్రయాణికుల వాహన వ్యాపారం రెండు వేర్వేరు సంస్థలుగా కొనసాగనున్నాయి.
ఈ డీమెర్జర్ ప్లాన్ 2024లోనే ప్రకటించబడింది. అక్టోబర్ 1 నుంచి ఇది అధికారికంగా అమలులోకి రానుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఈ విభజన వ్యూహం గురించి ఇప్పటికే స్పష్టత ఇచ్చారు.
షేర్ హోల్డర్లకు కొత్తగా ఏర్పడే కమర్షియల్ వెహికిల్స్ కంపెనీలో కూడా సమాన వాటా లభించనుంది. అంటే 1:1 నిష్పత్తిలో షేర్లు పంచబడతాయి. ప్రస్తుత టాటా మోటార్స్ షేర్లు ఉన్నవారికి కొత్త కంపెనీలోనూ అదే స్థాయిలో షేర్లు దక్కుతాయి.
విభజన తర్వాత ప్రయాణికుల వాహనాలు, ఎలక్ట్రిక్ కార్లు, లగ్జరీ బ్రాండ్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్ ప్రస్తుత టాటా మోటార్స్ కిందనే ఉంటాయి. మరోవైపు ట్రక్స్, బస్సులు, వాణిజ్య వాహనాలు కొత్తగా ఏర్పడే టాటా మోటార్స్ కమర్షియల్ వెహికిల్స్ లిమిటెడ్ కిందకి వెళ్తాయి.
ఈ నిర్ణయం వ్యాపార వృద్ధిని వేగవంతం చేయడానికే అని కంపెనీ చెబుతోంది. వేర్వేరు వ్యూహాలతో, వేర్వేరు మార్కెట్లను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి సాధించేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
మొత్తం మీద, ఈ డీమెర్జర్ తర్వాత ఇన్వెస్టర్లకు షేర్లపై ఎటువంటి గందరగోళం ఉండదని స్పష్టమైంది. రెండూ కంపెనీలు స్వతంత్రంగా పని చేస్తూ, టాటా బ్రాండ్ బలాన్ని కొనసాగించనున్నాయి.