
న్యూస్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ సిఫార్సు వెనుక పెద్ద కుట్ర ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ కుట్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాత్ర కూడా ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేడిగడ్డ బ్యారేజీ ఘటన తర్వాత రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రాజెక్టుపై విష ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. కిషన్ రెడ్డి రాసిన లేఖ ఆధారంగానే జాతీయ డ్యామ్ భద్రతా అథారిటీ రంగంలోకి దిగిందని తెలిపారు. గతంలో చంద్రబాబు వేసిన కేసులే ఇప్పుడు సీబీఐ విచారణ రూపంలో తిరిగి వస్తున్నాయని అన్నారు.
అధికారులు ఎవరూ ప్రాజెక్టుకు అనుకూలంగా మాట్లాడొద్దని సీఎం రేవంత్ బెదిరించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ కూడా ఆ ప్రభావంతోనే తయారైందని, కేవలం రూ.6 కోట్లు రికవరీ చేయాలని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు.
స్థానిక అధికారులను విచారించకపోవడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అంతేకాక సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు వ్యాఖ్యలపై కూడా ఆయన విమర్శలు చేశారు. ఆయన డాక్టరేట్ నిజమా అన్న సందేహం ఉందని వ్యాఖ్యానించారు.
డీపీఆర్ లేకుండా చేపడుతున్న కొడంగల్, నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణంపైనా సీబీఐ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు.