
న్యూస్ డెస్క్: బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) ప్రకటించిన ‘ప్రతి ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం’ అనే హామీ దేశంలోని ఇతర రాష్ట్రాల రాజకీయాలనూ ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ పవర్ ఫుల్ హామీ వర్కౌట్ అయి, గంపగుత్తగా ఓట్లు రాలితే, దేశంలోని అనేక రాజకీయ పార్టీలు దీన్ని తమ ఎన్నికల హామీలలో అగ్రభాగాన ఉంచే అవకాశం ఉంది. ఈ హామీతో ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినట్లు అయింది.
బీహార్‌లో నిరుద్యోగం రేటు చాలా ఎక్కువగా ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు రెండు కోట్ల ఏడు లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇంటికో ఉద్యోగం అంటే ఈ నిరుద్యోగులందరికీ గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వాల్సిందే. ఇంత పెద్ద హామీని ఎవరూ ఇంతవరకు భుజాన వేసుకోలేదు. అందుకే ఆర్జేడీ ఈ హామీతో ఎన్నికల్లో గట్టెక్కడానికి చూస్తోంది.
అయితే, ఎన్నికల్లో గెలిచాక ఈ హామీ అమలుపై అనేక మెలికలు పెట్టే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్లలో ఇవ్వాల్సిన ఉద్యోగాలను శతకోటి కండిషన్లు పెట్టి వేలల్లోకి కుదించేయవచ్చు. అంతేకాదు, కాంట్రాక్ట్ లేదా క్యాజువల్ జాబ్స్‌ను కూడా ఈ లిస్టులో కలిపేయవచ్చు. ఇలాంటి ఉపాయాలు ఉంటే, ఈ హామీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది.
గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇవ్వడం తగ్గించేశాయి. దీనికి కారణం, బడ్జెట్‌లో అత్యధిక భాగం జీతాల చెల్లింపునకే పోవడం. ఆర్థిక సమస్యల వల్ల ఏ రాష్ట్రమూ ఇంత పెద్ద హామీని ఇవ్వలేని స్థితిలో ఉంది. అందుకే ఈ హామీని చాలా గొప్పగా తేజస్వీ యాదవ్ ప్రకటించారు.
నిజానికి, ఎన్నికల హామీలన్నీ రంగుల కలలే అని ఓటర్లకు అర్థమైంది. ఒడ్డుకు చేరడం కోసం ఓడ మల్లన్న అంటారు కానీ తీరా గెలిచాక బోడి మల్లన్నగానే అంతా భావిస్తారని ఒక నానుడి ఉంది. అందుకే ఇటీవల కాలంలో ఓటర్లు తమకు సంఘం, సమాజం కంటే వ్యక్తిగత లాభాలే ముఖ్యమని భావించడం మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలలో సైతం వ్యక్తిగతంగా లాభం కలిగించే వాటి మీదనే పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. ఫలితంగా తాయిలాలు, వ్యక్తిగత లాభాలు ఓటర్లకు ఎంతో కొంత దక్కుతున్నాయి. ఈ కొత్త రకం రాజకీయానికి బీహార్ ఆర్జేడీ ఇచ్చిన ఈ హామీ ఒక ఉదాహరణ.
