
న్యూస్ డెస్క్: తెలంగాణలో అనూహ్యంగా వచ్చిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ నిజమైన గేమ్ చేంజర్‌గా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలో బీజేపీ గెలుస్తుందా అనేది చెప్పడం కష్టమే అయినా, అర్బన్ ఓటింగ్‌లో బీజేపీకి ప్రతి ఎన్నికలోనూ పెరుగుతున్న పట్టు, మోడీ ఫ్యాక్టర్ కలసి రావడాన్ని తక్కువ అంచనా వేయలేం. ఒకవేళ త్రిముఖ పోటీగా మారితే, బీజేపీ కచ్చితంగా ఏదో ఒక ప్రధాన పార్టీ కొంప ముంచడం ఖాయమని అంటున్నారు.
అద్భుతాలు సృష్టిస్తామని బీజేపీ తన వ్యూహాలను నమ్ముకుంటోంది. గతంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కూడా అర్బన్ ఓటింగ్‌లో బీజేపీ తన సత్తా చాటింది. ఇప్పుడు అదే ఫార్ములాతో బరిలోకి దిగుతోంది. బీజేపీ చీల్చే ఓట్లు అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్లలో ఏ పార్టీకి నష్టం కలిగిస్తుంది అన్నదే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది.
ఈ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ఒక అగ్నిపరీక్షగా చూస్తోంది. గతంలో గెలవని అర్బన్ ఏరియాలో అధికారం చేతిలో ఉంది. డైనమిక్ సీఎంగా గుర్తింపు ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్బన్ సెక్టార్‌లో తమ గ్రాఫ్ పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. లోకల్ కార్డుతో పాటు బీసీ ప్లస్ మైనారిటీల మద్దతు ఏకమొత్తంగా కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ నవీన్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది.
అదే సమయంలో, బీఆర్ఎస్ ఈ సీటును రెండు దఫాలుగా గెలుస్తూ వచ్చింది. అందుకే తమ సొంత సీటులో సత్తా చాటాలని ఆరాటపడుతోంది. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబానికి టికెట్ ఇవ్వడం ద్వారా సానుభూతి తమకు కలసి వస్తుందని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది. మహిళకు టికెట్ ఇవ్వడంతో పాటు అర్బన్ ఓటర్లలో తమకు ఉన్న పట్టు గెలుపు ఖాయమని అనుకుంటోంది.
తెలంగాణలో అందరిలో ఆసక్తిని పెంచుతున్న జూబ్లీహిల్స్ పోరు, సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో అనూహ్యంగా, అనివార్యంగా వచ్చిపడిన ఎన్నిక. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ఇలాంటి ఎన్నికలను కోరుకోవు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది ఒక సవాల్ గా మారింది.
