
న్యూస్ డెస్క్: బెంగళూరులో జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదిక సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆర్సీబీ విజయోత్సవ పరేడ్‌కి పోలీసుల అనుమతి లేకుండా జనసందర్భం కల్పించడమే ఈ దుర్ఘటనకు ప్రధాన కారణమని స్పష్టం చేసింది.
ఆ రోజు ఉదయం 7 గంటలకే ఆర్సీబీ తమ సోషల్ మీడియాలో ఉచిత ప్రవేశంతో పరేడ్‌కి ఆహ్వానం ఇచ్చింది. కొద్దిసేపటికే విరాట్ కోహ్లీ వీడియో పోస్ట్ కావడంతో వేడుకను ప్రత్యక్షంగా చూడాలనుకున్న లక్షలాది మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు పోటెత్తారు.
స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మంది మాత్రమే అయినప్పటికీ, దాదాపు 2-3 లక్షలమంది గుమికూడటంతో గేట్లు ధ్వంసమయ్యాయి. దీంతో తొక్కిసలాట జరిగిన దృశ్యాలు కలకలం రేపాయి.
నివేదిక ప్రకారం, తాత్కాలికంగా డ్రైన్‌పై వేసిన ప్లాట్ కూలిపోవడం వల్ల మరింత ప్రాణనష్టం జరిగింది. అభిమానుల నియంత్రణలో ఆర్సీబీ, కేఎస్‌సీఏ, డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఘోరంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు.
ఇప్పటికే అధికారులు సస్పెండ్ కాగా, జ్యుడీషియల్ విచారణతో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది.