
రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం పెను విషాదం చోటుచేసుకుంది. తాండూరు నుంచి హైదరాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన ఓ కంకర లారీ బలంగా ఢీకొట్టింది. ఈ పెను ప్రమాదంలో ప్రాథమిక సమాచారం ప్రకారం 17 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరు అత్యంత భయానకంగా ఉంది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మీర్జాగూడ సమీపంలోకి రాగానే, వేగంగా దూసుకొచ్చిన కంకర లారీ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది.
ఢీకొన్న వేగానికి లారీ బస్సుపైనే బోల్తా పడింది. దీంతో లారీలోని టన్నుల కొద్దీ కంకర మొత్తం ప్రయాణికులపై పడి, బస్సులో చాలా భాగం కప్పివేసింది. చాలా మంది ప్రయాణికులు కంకర రాళ్ల కింద పూర్తిగా కూరుకుపోయి, ఊపిరాడక చనిపోయినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్‌లోని వివిధ కళాశాలల్లో చదువుకునే విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఉన్నారు.
ఆదివారం సెలవు కావడంతో సొంత ఊళ్లకు వెళ్లి, తిరిగి సోమవారం విధుల్లో చేరేందుకు, క్లాసులకు హాజరయ్యేందుకు వస్తుండగా ఈ ఘోర ప్రమాదం జరగడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు తక్షణమే ప్రారంభమయ్యాయి. కంకర కింద చిక్కుకున్న వారిని బయటకు తీయడం అసాధ్యంగా మారడంతో, అధికారులు మూడు జేసీబీలను రంగంలోకి దించారు.
కంకరను తొలగిస్తూ, చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ భయానక ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది.
