
న్యూస్ డెస్క్: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. 47 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ, సొంతగడ్డపై తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడింది. నవీ ముంబైలో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి జగజ్జేతగా నిలిచింది.
ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు పలువురు రాజకీయ ప్రముఖులు, క్రీడాకారులు జట్టును ప్రశంసలతో ముంచెత్తారు.
ప్రధాని మోదీ స్పందిస్తూ, ఫైనల్‌లో అమ్మాయిలు అద్భుత నైపుణ్యం, ఆత్మవిశ్వాసం ప్రదర్శించారని కొనియాడారు. “టోర్నీ ఆసాంతం జట్టు అసాధారణ సమష్టి కృషిని కనబరిచింది. ఈ చారిత్రాత్మక విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ‘ఉమెన్ ఇన్ బ్లూ’ చరిత్ర సృష్టించిందని అన్నారు. “ఈ గెలుపు కోట్లాది అమ్మాయిల్లో స్ఫూర్తినిస్తుంది, వారు ధైర్యంగా కలలు కనేలా చేశారు. మీరు కేవలం ట్రోఫీ గెలవలేదు, జాతీయ స్ఫూర్తిని రగిల్చారు” అని ప్రశంసించారు.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, “మన బిడ్డలు దేశాన్ని గర్వపడేలా చేశారు. ఈ విజయం వారి అవిశ్రాంత దృఢ సంకల్పానికి నిదర్శనం, ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకం” అని అభినందించారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, దశాబ్దాల కలను మహిళల జట్టు నెరవేర్చిందని అన్నారు. “కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుత నాయకత్వంతో జట్టును నడిపించింది. ఈ విజయం పట్ల భారత్ గర్విస్తోంది” అని ఆయన పేర్కొన్నారు.
ఏపీ మంత్రి నారా లోకేశ్, క్రీడాకారులకు సెల్యూట్ చేస్తూ, ఈ గెలుపు రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ముఖ్యంగా, జట్టులోని ఏపీ అమ్మాయి, తెలుగమ్మాయి శ్రీచరణి భవిష్యత్తులో గొప్ప శిఖరాలకు చేరుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన షెఫాలీ వర్మ (87 పరుగులు, 2 వికెట్లు), దీప్తి శర్మ (58 పరుగులు, 5 వికెట్లు) భారత విజయంలో కీలక పాత్ర పోషించి దేశ కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు.
