
రామ్ గోపాల్ వర్మ సినిమాలంటే ఒకప్పుడు ఉండే ఆసక్తి ఇప్పుడు లేదు. కానీ, తన తాజా చిత్రం ‘పోలీస్ స్టేషన్ మే భూత్’తో ఆయన మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటించి, ఆమె ఫస్ట్ లుక్ విడుదల చేయగా, అది ఇప్పుడు సంచలనంగా మారింది.
ఒకవైపు ‘బాహుబలి: ది ఎపిక్’ రీ-రిలీజ్‌తో ప్రేక్షకులు రమ్యకృష్ణను ‘శివగామి’గా చూసి ఆరాధిస్తున్నారు. రాజమాతగా ఆమె చూపిన హుందాతనం అందరినీ కట్టిపడేసింది. అలాంటి సమయంలో, వర్మ విడుదల చేసిన పోస్టర్ అందుకు పూర్తి భిన్నంగా ఉంది.
వర్మ సినిమాలో రమ్యకృష్ణ లుక్, ఆమె పోజ్ చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇది దాదాపు ‘బి-గ్రేడ్’ పాత్రను తలపించేలా ఉందని, ‘శివగామి’ లాంటి గొప్ప పాత్ర చేసిన రమ్యకృష్ణ ఇలాంటివి చేయడం అవసరమా అని విమర్శలు వస్తున్నాయి.
అయితే, రమ్యకృష్ణ పాత్రల ఎంపికలో ఎంత పక్కాగా ఉంటారో అందరికీ తెలిసిందే. నటనకు ఆస్కారం ఉంటే తప్ప ఆమె ఏ పాత్రనూ అంగీకరించరు. కాబట్టి, ఈ పాత్రలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వర్మ ఈ సినిమాలో రమ్యకృష్ణను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నారు. ఆమె పాత్ర దెయ్యం కాదని వర్మ క్లారిటీ ఇచ్చారు, దీంతో ఇది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అయ్యి ఉండవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మనోజ్ బాజ్‌పాయ్, జెనీలియా కూడా నటిస్తున్న ఈ సినిమాపై రమ్యకృష్ణ ఎంట్రీతో కొత్తగా బజ్ క్రియేట్ అయింది.
