న్యూస్ డెస్క్: ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్‌లో ఇటీవల ఎదురైన ప్రమాద ఘటనపై కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక నివేదిక అందిందని, తుది నివేదిక కోసం వేచి చూస్తున్నామని తెలిపారు.
రాజ్యసభలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు, ఈ దుర్ఘటనపై అన్ని నియమావళులకు అనుగుణంగా దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏఏఐబీ పూర్తి పారదర్శకంగా విచారణ చేస్తున్నదని చెప్పారు.
అయితే ఈ ఘటనపై కొన్ని విదేశీ మీడియా సంస్థలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని, అవి నిజానికి దగ్గరగా లేవని మండిపడ్డారు. దేశాన్ని విమర్శించేందుకు ఇలాంటి ప్రసారాలు ఉపయోగపడవని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రమాద సమయంలో ఉన్న బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నా, అందులోని డేటాను రికవర్ చేశామని వెల్లడించారు. తొలిసారి డీకోడ్ చేయగలిగామని తెలిపారు.
ఈ నివేదికల ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. విమానాశ్రయాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని వివరించారు.
విమాన ప్రమాదాల నివారణకు ప్రభుత్వం అన్ని విధాల శ్రద్ధ వహిస్తోందని స్పష్టం చేశారు. భద్రతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.