
న్యూస్ డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి పదవి లభించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్న ఆయన, ఈసారి “నా సహనం పరీక్షించొద్దు” అంటూ స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.
నల్లగొండ జిల్లా నుంచి 11 మంది ఎమ్మెల్యేలు గెలిచారని, వారిలో కనీసం ముగ్గురికి మంత్రి పదవి ఇవ్వడం న్యాయం అని ఆయన వాదించారు. ఖమ్మం జిల్లాలో 9 మంది గెలవగా, ముగ్గురికి పదవులు ఇచ్చారని ఉదాహరణ చూపించారు. తమ జిల్లాకు కూడా అదే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
“ఒకే కుటుంబంలో ఇద్దరికీ మంత్రి పదవులా?” అని కొందరి విమర్శలపై స్పందిస్తూ, టికెట్లు ఇచ్చినప్పుడు, పార్లమెంట్ ఎన్నికల హామీల సమయంలో మేము అన్నదమ్ములమనే విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. గెలిపించుకోవడానికి ఇచ్చిన హామీలు ఇప్పుడు ఎందుకు మరిచారని ఆయన విమర్శించారు.
తాను ఇప్పటికీ సహనంగా ఉన్నానని, కానీ తన సహనాన్ని పరీక్షించవద్దని పార్టీ నేతలకు సూచించారు. తనకు పదవి రాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో తెలుసునని, సమయం వచ్చినప్పుడు వారిని బయట పెడతానని హెచ్చరించారు.
రాజగోపాల్ చేసిన ఈ వ్యాఖ్యలు పార్టీ లోపల మళ్లీ చర్చనీయాంశమయ్యాయి. అధిష్టానం ఈ సారి ఎలా స్పందిస్తుందో అందరి దృష్టి అక్కడే నిలిచింది.
