న్యూస్ డెస్క్: హర్యానాలోని గురుగ్రామ్‌లో టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తన కుమార్తె “నువ్వు నా సంపాదనపై జీవిస్తున్నావు” అంటూ అవహేళనించిందని తండ్రి దీపక్ యాదవ్ పేర్కొన్న వాదనపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఘటన రోజు రాధికా వంట చేస్తుండగా తండ్రి దీపక్ ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. దీపక్‌ను పోలీసులు అరెస్టు చేసి విచారించగా, తన కుమార్తె మాటలతో మనస్తాపానికి గురై హత్య చేశానని ఒప్పుకున్నాడు.
అయితే దీపక్ చెప్పిన వాదనను అతని కుటుంబ పరిచయస్థులు నమ్మడంలేదు. అతనికి గురుగ్రామ్‌లో పలు ఆస్తులు ఉండగా, నెలకు రూ.15–17 లక్షల ఆదాయం ఉంటుందని వారు చెబుతున్నారు. పైగా అతనికి ఫాంహౌస్ కూడా ఉంది.
రాధికా మీద ప్రేమతో రూ.2 లక్షలు పెట్టి టెన్నిస్ రాకెట్లు కూడా కొనిచ్చాడని పేర్కొంటున్నారు. ఒకనాటి ఆదరణతో ఈ రోజు హత్య ఎందుకు జరిగిందనే అనుమానం అక్కడి స్థానికులలో నెలకొంది.
పోలీసులు ప్రస్తుతం ఈ హత్య వెనుక మరిన్ని కోణాలను పరిశీలిస్తున్నారు. దీపక్ వాదనకన్నా మానసిక ఒత్తిడి లేదా ఆస్తి సంబంధిత అంశాలపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది.