
న్యూస్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు పనులు గడువులోగా పూర్తవుతాయా అనే సందేహాలు మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్టులోని ముఖ్యమైన గైడ్ బండ్‌పై అధ్యయనం చేసిన అంతర్జాతీయ నిపుణులు సంచలన నివేదిక ఇచ్చారు. 2019 నుంచి 2024 మధ్య వరదలకు పాడైన గైడ్ బండ్‌ను కేవలం మరమ్మతులు చేయడం సాధ్యం కాదని, దానిని పూర్తిగా కొత్తగా నిర్మించాల్సిన అవసరం ఉందని నలుగురు సభ్యులతో కూడిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పర్ట్స్ ప్యానెల్ స్పష్టం చేసింది.
దీనితో పాటు, కొత్తగా నిర్మించే గైడ్ బండ్‌కు కూడా కొత్త డిజైన్లు చేయాలని నిపుణులు సూచించారు. అదేవిధంగా దిగువ కాఫర్ డ్యామ్ నుంచి వస్తున్న సీపేజీని నివారించేందుకు నిత్యం పర్యవేక్షణ చేయాలని సూచించింది.
2027 నాటికి ప్రధాన ప్రాజెక్టు పనులు పూర్తవుతాయని నిర్మాణ సంస్థ చెబుతున్నప్పటికీ, గైడ్ బండ్ పునర్నిర్మాణం పూర్తయితేనే అది సాధ్యమని నివేదిక స్పష్టం చేసింది.
గత ప్రభుత్వ హయాంలో పాడైన డయాఫ్రం వాల్‌కు సమాంతరంగా నిర్మిస్తున్న కొత్త వాల్ పనులు ఏడు నెలల్లోనే 50 శాతం పూర్తవడంపై నిపుణులు ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేందుకు మరికొన్ని కీలక సూచనలు చేస్తూ, నిర్మాణ పనులను సాంకేతికంగా నిత్యం పర్యవేక్షించాలని కమిటీ సూచించింది.
గత ప్రభుత్వంలో పనులు సజావుగా సాగకపోవడం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతినడంతోపాటు, గైడ్ బండ్ కుంగిపోయిందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను పునర్మిస్తూనే గైడ్ బండ్‌ను కూడా సరిచేయాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల పనులు వేగవంతం అవుతాయని అనుకున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖను సంప్రదించింది. భవిష్యత్తు నిర్మాణాలపై తగిన సలహాల కోసం నలుగురు అంతర్జాతీయ నిపుణులతో కేంద్రాన్ని కమిటీని ఏర్పాటు చేసింది. అమెరికాకు చెందిన డేవిడ్ బి. పాల్, జియాస్ ఫ్రాంకో డిసిస్కో, కెనడాకు చెందిన రిచర్డ్ డొనెల్లీ, ఎస్. హించ్ బెర్గర్ ఈ టీమ్‌లో ఉన్నారు.
ఈ నలుగురు నిపుణులు మొత్తం ఐదు సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించి, పనుల పురోగతి, గైడ్ బండ్, కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ నిర్మాణాలను పరిశీలించారు. గత ఆగస్టులో వారు చివరిసారిగా పోలవరం వచ్చి కేంద్రానికి ఈ సమగ్ర నివేదికను సమర్పించారు.
