
న్యూస్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ దేశ స్వావలంబనను బలోపేతం చేసేందుకు స్వదేశీ ఉత్పత్తుల వినియోగాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ ఫేజ్-2 బాలికల వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమంలో వీడియో సందేశం ఇచ్చిన ఆయన, ఈ ఉద్యమానికి యువతే నాయకత్వం వహించాలని సూచించారు.
ప్రధాని మాట్లాడుతూ, ప్రతి వ్యాపారి తమ వద్ద “కేవలం స్వదేశీ ఉత్పత్తులు మాత్రమే” అనే బోర్డు పెట్టుకోవాలని చెప్పారు. కుటుంబాలు కూడా దేశీయ వస్తువుల కొనుగోలుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ప్రజల శ్రేయస్సు కోసం నిస్వార్థంగా కృషి చేస్తే దైవబలం కూడా తోడుంటుందని ఆయన పేర్కొన్నారు.
మహిళా సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించిన మోదీ, కొత్త హాస్టల్‌లో 3,000 బాలికలకు వసతి కల్పించనున్నట్టు తెలిపారు. ఈ ప్రయత్నం వారిని ఆత్మవిశ్వాసంతో ఎదగడానికి తోడ్పడుతుందని చెప్పారు. గుజరాత్‌లోని పలు నగరాల్లో కూడా ఇలాంటి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు.
గ్రామీణ మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించేందుకు ‘లఖ్‌పతి దీదీలు’, ‘డ్రోన్ దీదీ’, ‘బ్యాంక్ సఖి’ వంటి పథకాలను అమలు చేస్తున్నామని వివరించారు. నూతన జాతీయ విద్యా విధానం నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తోందని అన్నారు.
సౌరశక్తి, రక్షణ, డ్రోన్, స్టార్టప్ రంగాల్లో భారత్ వేగంగా ఎదుగుతోందని మోదీ పేర్కొన్నారు. ఉపాధి అవకాశాలు పెంచేందుకు తాజాగా రూ.1 లక్ష కోట్లతో ‘ప్రధాన మంత్రి వికసిత భారత్ రోజ్‌గార్ యోజన’ ప్రారంభించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ పాల్గొన్నారు.