
న్యూస్ డెస్క్: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో “సేనతో సేనాని” కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. మొదటి రెండు రోజులు పార్టీ అంతర్గత చర్చలకే పరిమితం కాగా, మూడవ రోజు బహిరంగ సభతో ముగించనున్నారు. ఈ వేదికపై ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా పవన్ దిశానిర్దేశం చేయనున్నారు.
మొదటి రోజు జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువ కావడానికి కేవలం శాఖలకే పరిమితం కాకుండా, తరచూ ప్రజలతో, కార్యకర్తలతో కలుసుకోవాలని నిర్ణయించారు. ప్రభుత్వ పథకాల అమలును సమర్థవంతంగా ప్రజల్లోకి చేర్చే విధానంపై చర్చ జరిగింది.
ఈసారి ప్రత్యేకంగా, ప్రతి నియోజకవర్గం నుంచి కేవలం పది మందిని మాత్రమే ఎంపిక చేసి సమావేశానికి ఆహ్వానించారు. వీరితో పవన్ నేరుగా సమావేశమై, పార్టీ భవిష్యత్ వ్యూహాలపై చర్చించనున్నారు. పెద్ద సంఖ్య కంటే, బలమైన గళం వినిపించే కొద్ది మంది చాలు అనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అంతర్గత చర్చల్లో కొద్దిమంది అయినా పార్టీకి శక్తివంతమైన బలంగా మారతారని పవన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వీరికి ప్రత్యేకంగా బ్లూ ప్రింట్ సిద్ధం చేసి, నియోజకవర్గాల వారీగా పార్టీని బలోపేతం చేసే పనిలో వాడనున్నారు. దీంతో జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
అల్లూరి సీతారామరాజు పేరుతో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం కూడా విశేషం. మిత్రపక్షమైన టీడీపీ దూకుడు చూపుతున్న తరుణంలో, జనసేన తన స్థానాన్ని బలపర్చుకోవాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని పవన్ ప్రారంభించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
