
న్యూస్ డెస్క్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటి వరకు 36 మంది మృతి చెందగా, మరో 34 మంది గాయపడ్డారు.
మృతుల్లో పలువురి శరీరాలు పూర్తిగా కాలిపోయిన నేపధ్యంలో అధికారులు డీఎన్ఏ పరీక్షల ద్వారా గుర్తింపు ప్రక్రియను చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 14 మంది మృతులను అధికారికంగా గుర్తించినట్లు వెల్లడించారు.
ప్రమాదం సమయంలో ఫ్యాక్టరీలో 143 మంది విధుల్లో ఉన్నారని అధికారులు పేర్కొన్నా, సంస్థ మాత్రం 156 మంది ఉన్నారని చెబుతోంది. దీంతో సమాచారం విషయంలో గందరగోళం నెలకొంది.
ఇంకా 13 మంది కార్మికులు గల్లంతు కావడంతో వారి వివరాలు శిథిలాల తొలగింపు అనంతరం తెలిసే అవకాశముందని పేర్కొన్నారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండే అవకాశాన్ని అధికారాలు వదులుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. భారీ క్రేన్లు, యంత్రాల సాయంతో శిథిలాలు తొలగిస్తున్నారు.