
న్యూస్ డెస్క్: యాప్ ఆధారిత ట్యాక్సీ సేవలైన ఓలా, ఉబర్ సంస్థలకు కేంద్రం నుంచి ఊరట లభించింది. రద్దీ సమయాల్లో సర్జ్ ఛార్జీ వసూలు పరిమితిని కేంద్ర రవాణా శాఖ తాజాగా పెంచింది.
‘మోటార్ వెహికిల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్’ను సవరించిన కేంద్రం, రద్దీ సమయంలో బేస్ ఛార్జీపై 200 శాతం వరకూ సర్జ్ ఛార్జీ విధించేందుకు అనుమతించింది. ఇది గతంలో 150 శాతమే.
అలాగే సాధారణ సమయంలో 50 శాతం వరకూ అదనంగా వసూలు చేసుకోవచ్చు. దీంతో క్యాబ్ సంస్థలు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం పొందాయి.
ఇక ప్రయాణికుల రక్షణకు ఒక కీలక నిబంధనను కేంద్రం జారీ చేసింది. మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణాలపై ఎలాంటి సర్జ్ ఛార్జీలు విధించకూడదని స్పష్టం చేసింది.
ఈ మార్గదర్శకాలు ట్యాక్సీ సంస్థలకు మేలు చేయనున్నప్పటికీ, ప్రయాణికులకు రద్దీ సమయాల్లో భారమైన ఛార్జీలు మిగలే అవకాశం ఉంది.
జూలై నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నట్లు కేంద్ర రవాణా శాఖ ప్రకటించింది.
