
న్యూస్ డెస్క్: యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయ నర్సు నిమిష ప్రియ కేసులో మరోసారి చిక్కులు ఎదురయ్యాయి. ఇటీవల నిమిష ప్రియ మరణశిక్షను యెమెన్ అధికారులు రద్దు చేశారన్న వార్తలు విన్నవారు చాలామందే ఉన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా ఈ వార్తలను ఖండించాయి.
విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేసిన వివరాల ప్రకారం, నిమిష ప్రియ మరణశిక్షపై యెమెన్ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని వెల్లడించారు.
సోమవారం అర్ధరాత్రి గ్రాండ్ ముఫ్తీ కార్యాలయం ఇచ్చిన ప్రకటనకు ఆధారాలు లేవని తెలిపారు. విదేశాంగ శాఖ వర్గాలు అవాస్తవ ప్రచారాలకు ఎవ్వరూ నమ్మవద్దని సూచించాయి.
ఈ కేసులో ఇప్పటికే భారత ప్రభుత్వం బాధిత కుటుంబంతో చర్చలు జరిపేందుకు యెమెన్‌ను అభ్యర్థించింది. జులై 16న నిమిష ప్రియ మరణశిక్ష అమలుపై చివరి నిమిషంలో వాయిదా పడింది. కానీ, బాధిత కుటుంబం బ్లడ్ మనీకి అంగీకరించకపోవడం వల్ల కేసు పరిష్కారం ఆలస్యం అవుతోంది.
ఇక నిమిష ప్రియ భద్రత కోసం భారత ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. కానీ, మరణశిక్షపై స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉంది.