
ఏపీ: నెల్లూరులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని హత్య చేసేందుకే ఇంటిపై దాడి జరిగిందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.
ఈ దాడిలో సుమారు 200 మందికి పైగా మారణాయుధాలతో వచ్చారని తెలిపారు. ఈ ఘటనకు ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు.
ఈ ఘటనపై బాధితులు జిల్లా ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్, “ఇంట్లో ఉన్న తల్లి షాక్‌కు గురయ్యారు. ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నించారు.
అనిల్ కుమార్, తనను జైలుకు పంపాలని ప్రయత్నం జరుగుతోందని, అయితే తాను దేనికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. క్వార్ట్జ్ కేసులో తన తర్వాత జైలుకు వెళ్లేది ఎంపీ ప్రభాకర్ రెడ్డే అని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన దాడి అని ఆరోపించారు. దేవుడి దయ వల్లే ప్రసన్న ప్రాణాలతో బయటపడ్డారని చెప్పారు.
దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.