
న్యూస్ డెస్క్: భారత స్టార్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎట్టకేలకు తన అంతర్జాతీయ కెరీర్ ముగింపుపై స్పందించాడు. ఒక ఇంటర్వ్యూలో తన భావోద్వేగాలను వెల్లడించిన గబ్బర్, తనపై జట్టులో చోటు కోల్పోయినప్పుడు ఎలా భావించాడో వివరించాడు.
“ఇషాన్ కిషన్ 200 పరుగులు చేసిన రోజే, నా అంతరాత్మ ఈది చివరైపోయిందని చెప్పింది” అని ధావన్ పేర్కొన్నాడు. అప్పట్లో 50లు, 70లు చేసినా, శతకాలు లేకపోవడమే తనపై ప్రభావం చూపిందని గుర్తు చేసుకున్నాడు.
2023 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోవడానికి గిల్ అద్భుత ఫామ్ కూడా కారణమని అంగీకరించాడు. “అతడు అన్ని ఫార్మాట్లలో అద్భుతంగా ఆడుతున్నాడు. నేను మాత్రం వన్డేలకు మాత్రమే అందుబాటులో ఉన్నాను” అని వివరించాడు.
2021 టీ20 వరల్డ్‌కప్‌లో తనకు అవకాశం రాదని ముందే అంచనా వేసినట్టు తెలిపాడు. “ఎవరినీ అడగడం అవసరం అనిపించలేదు. నా మార్గం నాదే” అని స్పష్టం చేశాడు.
అయితే అప్పటి కోచ్ రాహుల్ ద్రావిడ్ మాత్రం మెసేజ్ చేసి మాట్లాడారని ధావన్ తెలిపారు. ప్రస్తుతం ధావన్ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.
