
న్యూస్ డెస్క్: అమెరికాలో బడ్జెట్ ఆమోదం నిలిచిపోవడంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ షట్‌డౌన్ అమల్లోకి వచ్చింది. దీని ప్రత్యక్ష ప్రభావం ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ నాసా (NASA) మీద పడింది.
అధికారిక ప్రకటనలో నాసా తన కీలకేతర కార్యకలాపాలన్నింటినీ తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే పూర్తిస్థాయి మూసివేత కాదు. అత్యవసర కార్యకలాపాలు మాత్రం కొనసాగుతాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) ఉన్న వ్యోమగాముల భద్రత, ఇప్పటికే ప్రయోగించిన ఉపగ్రహాల ఆపరేషన్లు మాత్రం యధావిధిగా కొనసాగుతాయి.
కానీ కొత్త మిషన్లు, పరిశోధన ప్రాజెక్టులు, ల్యాబ్ టెస్టులు, డేటా విశ్లేషణ, అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు అన్నీ నిలిపివేయబడ్డాయి.
గత ఆరు సంవత్సరాలలో ఇదే తొలిసారి నాసా కార్యకలాపాలు ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా ఆగిపోవడం గమనార్హం. ముందూ ఇలాంటి పరిణామాలు ఎదురైనా అంతరిక్ష పరిశోధనల్లో ఇంతటి ఆటంకం కలగలేదు. ఈసారి మాత్రం కాంగ్రెస్‌లోని బడ్జెట్ వివాదం శాస్త్ర సాంకేతిక రంగాన్నే తాకింది.
ఇక నిపుణులు అమెరికా భవిష్యత్ అంతరిక్ష ప్రాజెక్టులపై పెను ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టెమిస్ చంద్ర మిషన్, మంగళగ్రహ ప్రాజెక్టులు, కొత్త ఉపగ్రహ ప్రయోగాలన్నీ ఆలస్యం కావచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
బడ్జెట్ ఆమోదం ఎంత ఆలస్యం అయితే, అంతరిక్ష ప్రోగ్రామ్స్‌లో అంత పెద్ద ఆటంకం ఏర్పడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అంతరిక్ష రంగం అంతర్జాతీయ స్థాయిలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో అమెరికా రాజకీయ కలహాలు పెద్ద వెనుకడుగు వేయించాయని నిపుణుల అభిప్రాయం.
