Sunday, January 18, 2026
HomeAndhra Pradeshలోకేశ్‌పై మోదీ ప్రశంసల జల్లు.. రాయలసీమకు భారీ ప్రాజెక్టులు!

లోకేశ్‌పై మోదీ ప్రశంసల జల్లు.. రాయలసీమకు భారీ ప్రాజెక్టులు!

modi-praises-nara-lokesh-gst-campaign-kurnool-projects-3102bc

న్యూస్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కర్నూలు సభలో ఉప ముఖ్యమంత్రి నారా లోకేశ్‌ను ప్రత్యేకంగా ప్రశంసించారు. “ఉత్సాహవంతుడైన యువ మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో జీఎస్టీ సంస్కరణల ప్రచారం ఓ వేడుకలా సాగుతోంది. అందుకు లోకేశ్‌ను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను,” అని మోదీ కితాబిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితేనే ‘వికసిత భారత్’ లక్ష్యం సాకారమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మోదీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లను కూడా ప్రశంసించారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నేతల సారథ్యంలో ఏపీ వేగంగా అభివృద్ధి పథంలో పయనిస్తోందన్నారు. గత 16 నెలలుగా ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ పాలనతో ప్రగతి పరుగులు పెడుతోందని చెప్పారు.

ప్రజల జీవితాలను సులభతరం చేయడమే తమ లక్ష్యమని మోదీ అన్నారు. నవరాత్రులకు ముందు జీఎస్టీ సంస్కరణలు తెచ్చి ప్రజలపై పన్నుల భారం తగ్గించామని తెలిపారు. ఈ సంస్కరణల వల్ల ప్రజలకు రూ. 8 వేల కోట్ల మేర ఆదా కావడం సంతోషకరమన్నారు.

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ విశాఖపట్నంలో అతిపెద్ద పెట్టుబడి పెడుతోంది. దేశంలోనే తొలి అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కేంద్రాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అమెరికా వెలుపల గూగుల్ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదేనని గూగుల్ సీఈఓ తనతో చెప్పారని మోదీ వెల్లడించారు.

రాయలసీమ అభివృద్ధికి తాజా ప్రాజెక్టులు కొత్త మార్గాలు వేస్తాయని మోదీ అన్నారు. కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక నోడ్ల ద్వారా పెట్టుబడులు, ఉద్యోగాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కర్నూలును ‘భారత్ డ్రోన్ హబ్’గా తయారు చేయాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. గురువారం కర్నూలు సమీపంలోని నన్నూరు చెక్‌పోస్ట్ వద్ద నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. అంతకుముందు ఆయన శ్రీశైలంలో పూజలు నిర్వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular