
కామెడీ సినిమాలు చేయడం ఎంత సులభమో అనిపించినా, నవ్వులు పండించడం అంత కష్టం. అలాంటి ప్రయత్నం చేసిన చిత్రం ‘మిత్రమండలి’. ప్రియదర్శి హీరోగా, నిహారిక ఎన్‌ఎం హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్ సమర్పకుడిగా రూపొందించారు. ఇక సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథ
కులపిచ్చి పట్టుకున్న ఒక రాజకీయ నాయకుడు నారాయణ (వీటీవీ గణేశన్) తన కూతురు స్వేచ్ఛ (నిహారిక) ప్రేమలో పడి ఇంటి నుంచి పారిపోవడంతో షాక్ అవుతాడు. తన ప్రతిష్ఠ కాపాడుకోవడానికి పోలీస్ ఆఫీసర్ సాగర్ (వెన్నెల కిషోర్)ను సంప్రదించి, ఆమెను వెతికివ్వమని కోరతాడు.
దర్యాప్తు చేయగా, స్వేచ్ఛ అదృశ్యానికి నలుగురు స్నేహితులు రాము (ప్రియదర్శి), రాగ మయూర్, విష్ణు, ప్రసాద్ బెహరా కారణమని తెలుస్తుంది. వీళ్ళు ఊర్లో పనిలేని ఆవారా బ్యాచ్. కానీ వీళ్ళకు స్వేచ్ఛతో ఉన్న అసలు సంబంధం ఏంటి? ఆమె నిజంగా పారిపోయిందా లేక ఏదైనా ప్రమాదమా అన్నది మిగతా కథ.
విశ్లేషణ
మొదటి భాగంలో కొన్ని సన్నివేశాలు నవ్వులు తెప్పించడానికి ప్రయత్నించినా, అవి కూడా కాస్త బలవంతంగానే అనిపిస్తాయి. జాతిరత్నాలు తరహా ఫార్మాట్‌లో తీసిన ఈ చిత్రం, అదే ఫార్ములాను రిపీట్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది.
రెండవ భాగంలో కథ పూర్తిగా ట్రాక్ తప్పుతుంది. ఎలాంటి లాజిక్ లేకుండా సీన్లు సాగుతాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్, సత్య వంటి హాస్యనటులను వృథా చేశారు.
ప్రియదర్శి, రాగ మయూర్, ప్రసాద్ బెహర, విష్ణు లాంటి నటుల ప్రదర్శన బాగానే ఉన్నా, సీన్లు వారిని సపోర్ట్ చేయలేదు. సత్య టైమింగ్ కొంతవరకు బాగుంది కానీ అది కూడా ఓవర్‌గా అనిపిస్తుంది.
టెక్నికల్‌గా సినిమా సగటు స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సరిగా పనిచేయలేదు. రైటింగ్ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి.
మొత్తానికి, నవ్వించాలని వచ్చి ప్రేక్షకులనే పరీక్షించిన కామెడీగా ‘మిత్రమండలి’ నిలిచిపోయింది. బలమైన స్క్రిప్ట్ లేకపోవడంతో సినిమా మామూలు స్థాయిలో ముగిసింది.
ప్లస్ పాయింట్స్:
1. ప్రియదర్శి, సత్య నటన
2. కొన్ని సన్నివేశాల్లో కామెడీ
మైనస్ పాయింట్స్:
1. కథలో కొత్తదనం లేకపోవడం
2. రొటీన్ కామెడీ
3. టెక్నికల్ విలువలు బలహీనంగా ఉండటం
4. సెకండ్ హాఫ్
రేటింగ్: 2.25/5
