
న్యూస్ డెస్క్: ఢిల్లీలో ఆదివారం జరిగిన రెండు కీలక సమావేశాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితన్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా వరుసగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఈ భేటీలపై అధికారిక ప్రకటనలు రాకపోయినా, ఇవి జమ్ము కశ్మీర్ రాష్ట్ర హోదాపై ఉన్న ఊహాగానాలకు బలం చేకూర్చుతున్నాయి.
ప్రధాని మోదీ బ్రిటన్, మాల్దీవుల పర్యటనల నుంచి వచ్చిన వెంటనే రాష్ట్రపతిని కలిశారు. అతి కొద్ది గంటల వ్యవధిలోనే హోంమంత్రి అమిత్ షా కూడా రాష్ట్రపతితో సమావేశమయ్యారు. అంతేగాక, అనంతరం అమిత్ షా జమ్ము కశ్మీర్ నేతలతో ప్రత్యేకంగా భేటీ కావడం గమనార్హం.
ఆర్టికల్ 370 రద్దయిన ఆరేళ్లు నిండుతున్న వేళ… రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల మధ్య జరిగిన ఈ వరుస భేటీలు జమ్ము కశ్మీర్‌కు పునరాలోచనల దిశగా సాగుతున్నాయన్న సంకేతాలను ఇస్తున్నాయి. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ను రద్దు చేసి జమ్ము కశ్మీర్, లడఖ్‌లను విడిగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించింది.
అప్పటి నుంచి అనేక మార్లు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై హామీలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈసారి మాత్రం ఆగస్టు 5కి రెండు రోజుల ముందే ఈ భేటీలు జరగడం రాజకీయంగా ఆసక్తికర పరిణామంగా మారింది.
కేంద్రం తీసుకోబోయే తదుపరి నిర్ణయం ఏమిటనే ఉత్కంఠ పెరిగింది. రాష్ట్ర హోదా పునరుద్ధరణపై గడువు నిర్ణయించకపోయినా… రాజకీయంగా దీనిపై స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.
