
న్యూస్ డెస్క్: అమెరికా బాటలోనే నడుస్తూ మెక్సికో దేశం కూడా ఆసియా దేశాల దిగుమతులపై భారీ టారిఫ్ లను విధించింది. భారత్, చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు వేసే బిల్లుకు మెక్సికో సెనెట్ ఆమోదం తెలిపింది.
ఈ కఠినమైన వాణిజ్య చర్యలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన విధానాలను పోలి ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సెనెట్ లో 76 ఓట్లతో ఈ బిల్లు పాస్ అయింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఈ కొత్త సుంకాలు అమలులోకి రానున్నాయి.
భారత్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల నుంచి దిగుమతి అయ్యే 1400కు పైగా ఉత్పత్తులపై ఈ టారిఫ్ లు వర్తిస్తాయి. సుంకాలు 5 శాతం నుంచి 50 శాతం వరకూ ఉండనున్నాయి. ముఖ్యంగా ఆటోమొబైల్ తయారీ రంగానికి రక్షణ కల్పించడమే తమ లక్ష్యమని మెక్సికో అధికారులు తెలిపారు.
ఈ కొత్త టారిఫ్ లలో చైనా కార్లపై ఏకంగా 50 శాతం భారీ సుంకం విధించారు. స్టీల్, అల్యూమినియం, ఆటోపార్ట్స్, దుస్తులు వంటి ఉత్పత్తులపై కూడా 5 నుంచి 50 శాతం వరకూ సుంకాలు పడ్డాయి. ప్రస్తుతం మెక్సికో మార్కెట్లో చైనా కార్ల వాటా 20 శాతం ఉంది.
ఈ చర్యల ద్వారా వచ్చే ఏడాది సుమారు 2.8 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందని మెక్సికో అంచనా వేస్తోంది. ఫ్రీ ట్రేడ్ దేశంగా ఉన్న మెక్సికో, ఇలా కఠిన చర్యల వైపు మళ్లడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అయితే ఆసియా దేశాల దిగుమతులపై ఆధారపడే మెక్సికో తయారీ కంపెనీలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనివల్ల ఉత్పత్తి ఖర్చులు పెరిగి దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నాయి.
