
బీహార్: అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని సంచలనం నమోదైంది. ఆర్జేడీకి కంచుకోటగా, ముస్లిం ఓటు బ్యాంకు బలంగా ఉన్న అలీనగర్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగిరింది. ప్రముఖ జానపద గాయని మైథిలీ ఠాకూర్ (25) తన రాజకీయ అరంగేట్రంలోనే ఈ అద్భుతం సృష్టించారు. కేవలం రెండు నెలల క్రితం బీజేపీలో చేరిన ఆమె, కమలం పార్టీకి అందని ద్రాక్షగా ఉన్న స్థానాన్ని గెలిచి చరిత్ర సృష్టించారు.
ఈ విజయంతో మైథిలీ ఠాకూర్, బీహార్ అసెంబ్లీ చరిత్రలోనే “అతి పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యే”గా కొత్త రికార్డు సృష్టించారు. ఆమె 25 ఏళ్లకే ఈ ఘనత సాధించారు. ఇప్పటివరకు ఈ రికార్డు 26 ఏళ్ల వయసులో తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పేరిట ఉండేది. ఇప్పుడు మైథిలీ ఆ రికార్డును బద్దలు కొట్టారు.
అలీనగర్ స్థానంలో మైథిలీ ఠాకూర్, ఆర్జేడీ అభ్యర్థి బినోద్ మిశ్రాపై 11 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సీమాంచల్ ప్రాంతంలో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆర్జేడీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. అయినా, మైథిలీ పాపులారిటీ, బీజేపీ వ్యూహం ఫలించింది. ఎన్నికల సమయంలో అలీనగర్ పేరును ‘సీతానగర్’గా మారుస్తామన్న ప్రతిపాదన కూడా బీజేపీకి కలిసివచ్చినట్లు తెలుస్తోంది.
ఈసారి బీహార్ అసెంబ్లీ యంగ్‌స్టర్స్‌తో కళకళలాడనుంది. మైథిలీ ఠాకూర్‌తో పాటు, మరో ఐదుగురు 25 ఏళ్ల యువకులు (సోను కుమార్, నవీన్ కుమార్, కుందన్ కుమార్, శంబూబాబు, రాజ్ కుమార్ సాదా) కూడా ఎమ్మెల్యేలుగా గెలుపొందడం విశేషం. ఇది రాష్ట్ర రాజకీయాల్లో యువత ప్రాధాన్యతను సూచిస్తోంది.
తన విజయంపై మైథిలీ ఠాకూర్ భావోద్వేగానికి గురయ్యారు. “ఈ గెలుపు చాలా గొప్పది, ఆనందంతో నాకు మాటలు రావడం లేదు. ఇది నా గెలుపు కాదు, అలీనగర్ నియోజకవర్గ ప్రజల గెలుపు. వారు బీజేపీ పట్ల విశ్వాసం ప్రకటించారు” అని ఆమె మీడియాకు తెలిపారు.
తొలిసారి రాజకీయాల్లోకి వచ్చి, బీజేపీకి ఎన్నడూ గెలవని సీటును అందించి, అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించడం ద్వారా మైథిలీ ఠాకూర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారారు. ఆమె విజయం ఆర్జేడీకి గట్టి షాక్‌గా తగిలింది.
