
జూబ్లీహిల్స్: ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు ఊహించని షాక్ తగిలింది. ఎన్నికల పోరు కంటే పెద్దదిగా, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వారసత్వ వివాదం తెరపైకి రావడం సంచలనం రేపుతోంది.
గోపీనాథ్ మొదటి భార్య కుమారుడిగా తారక్ ప్రద్యుమ్న తెరపైకి వచ్చారు. తన తండ్రికి మొదటి భార్యతో విడాకులు కాలేదని, సునీత (రెండో భార్య) చట్టవిరుద్ధంగా లీగల్ హైర్ సర్టిఫికేట్ పొందారని ఆయన ఆరోపిస్తున్నారు.
తన తండ్రి అంత్యక్రియలకు కూడా తనను రానీయకుండా బెదిరించారని తారక్ ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి పేరు తన పాస్‌పోర్టులో ఉందని, తరచూ చాటింగ్ చేసుకునేవారమని, ఆధారాలన్నీ ఉన్నాయని ఆయన చెబుతున్నారు.
అయితే, ఈ ఆరోపణలను సునీత వర్గం ఖండిస్తోంది. పాతికేళ్లుగా నిశ్శబ్దంగా ఉండి, సరిగ్గా ఎన్నికల సమయంలోనే మొదటి కుటుంబం ఎందుకు బయటకు వచ్చిందని వారు రాజకీయ కోణంలో ప్రశ్నిస్తున్నారు.
ఈ వివాదం చందానగర్ తహసీల్దార్ వద్దకు చేరింది. ఇరువర్గాల వాదనలు విన్న ఆయన, గతంలో సునీతకు జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికేట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నవంబర్ 19లోగా పూర్తి పత్రాలు సమర్పించాలని ఆదేశించారు.
నవంబర్ 25న తుది నిర్ణయం వెలువడనుంది. ఏది ఏమైనా, రాజకీయ పోరుకంటే ముందే మొదలైన ఈ ‘ఇంటిపోరు’, సునీత అభ్యర్థిత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.
