
కర్నూలు జిల్లాపి: చిన్నటేకూరు వద్ద 19 మంది సజీవ దహనమైన ఘోర బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వేమూరి కావేరి ట్రావెల్స్ యజమాని వేమూరి వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆయన్ను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
అయితే, ఈ అరెస్టును పోలీసులు అత్యంత రహస్యంగా ఉంచడం గమనార్హం. గురువారం సాయంత్రం వరకు కూడా యజమాని ఆచూకీ తెలియదని చెప్పిన అధికారులు, శుక్రవారం ఉదయం నేరుగా ఆయన రిమాండ్ వార్తను వెల్లడించారు.
19 మంది మరణించిన ఈ సున్నితమైన కేసులో, నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెడితే వివాదాలు తలెత్తుతాయనే ఉద్దేశంతోనే, పోలీసులు ఆయనను గుట్టుచప్పుడు కాకుండా నేరుగా కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం.
ఈ కేసులో బస్సు డ్రైవర్ లక్ష్మయ్యను ఇప్పటికే ఏ-1గా అరెస్ట్ చేశారు. 5వ తరగతి చదివిన లక్ష్మయ్య, 10వ తరగతి ఫెయిల్ అయినట్లు నకిలీ పత్రాలు సృష్టించి హెవీ లైసెన్స్ పొందినట్లు దర్యాప్తులో తేలింది.
అక్టోబర్ 23 తెల్లవారుజామున రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ఈ బస్సు ఢీకొట్టి, ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ఈ ఘోరం జరిగింది. బస్సుకు ఫిట్‌నెస్ లేకపోవడం, డ్రైవర్‌కు నకిలీ లైసెన్స్ ఉండటంతో, యాజమాన్యం నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
