
న్యూస్ డెస్క్: మోదీ మూడోసారి ప్రధానిగా కూర్చొన్నారంటే దానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అసమర్థతే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాన పార్టీ నేతగా రాహల్ గాంధీ మోదీ విజయాన్ని నిలవరించడంలో ఘోరంగా విఫలమయ్యారని కేటీఆర్ జాతీయ మీడియాతో చెప్పారు.
మోదీ ప్రజల మనసు గెలిచి మూడుసార్లు ప్రధాని కాలేదని, కేవలం కాంగ్రెస్ నేత అసమర్థ నాయకత్వం బలహీన రాజకీయ వ్యూహాల వల్లే మోదీ విజయం సులువు అయ్యిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఒక రాజకీయ కూటమి వరుసగా మూడుసార్లు కేంద్రంలో అధికారంలోకి రావడం సాధారణ విషయం కాదు. మోదీ అమిత్ షాల చాణక్యం వల్లనే ఇది సాధ్యపడింది. విజయానికి ఏం కావాలో అధికారం నిలుపుకోడానికి ఏం చేయాలో మోదీ అమిత్ ద్వయానికి బాగా తెలుసని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ గాఢ నిద్రలో జారుకుందని, అది నిద్ర లేచే దాకా మోదీని కానీ, బీజేపీని కానీ ఎదురించే రాజకీయశక్తి ఉండదని కేటీఆర్ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించి సకాలంలో ఎండగట్టడంలో రాహుల్ గాంధీ దారుణంగా విఫలమయ్యారని ఆయన పేర్కొన్నారు.
బీజేపీని నిలువరించే శక్తి ఇపుడు కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని కేటీఆర్ తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచి పోరాడాల్సిన సందర్భం వచ్చిందని ఆయన మూడో కూటమి అవసరాన్ని ప్రస్తావించారు.
కేటీఆర్ కాంగ్రెస్ పై చేసిన విమర్శలు ఘాటుగా ఉన్నాయే తప్ప, బీజేపీని నిలువరించేలా లేవని మరికొందరి వ్యాఖ్య. బీఆర్ఎస్ సొంత రాష్ట్రం తెలంగాణలోనే అధికారం కోల్పోవడం ఈ విమర్శలకు ఆజ్యం పోస్తోంది.
