
న్యూస్ డెస్క్: పార్లమెంట్ శీతకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే వేడి పుట్టాయి. ప్రధాని నరేంద్ర మోదీ విపక్షాలనుద్దేశించి చేసిన ‘డ్రామా’ వ్యాఖ్య దేశ రాజకీయాల్లో కలకలం రేపింది. ఇండియా కూటమి ఈ వ్యాఖ్యలపై భగ్గుమంది.
సమావేశాలకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రధాని.. ప్రతిపక్షం బిహార్ ఓటమిని జీర్ణించుకోలేక పోతోందని విమర్శించారు. అనవసర డ్రామాలు ఆడుతూ సమయం వృథా చేసుకోరాదని హితవు పలికారు. వారికి కొన్ని సూచనలు అందజేస్తానని వ్యంగ్యంగా అన్నారు.
ప్రజాస్వామ్యంలో చర్చించాలనుకోవడం డ్రామా ఎలా అవుతుందని విపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఎన్డీయే గతంలో బిల్లులను బుల్డోజ్ చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి “అందరికన్నా పెద్ద డ్రామా మాస్టర్ చెబుతున్నారు” అంటూ సెటైర్ వేశారు.
అనుకున్నట్టుగానే పార్లమెంట్ సమావేశాలు వేడివేడిగా సాగాయి. కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా పరిశీలన (‘సర్’)పై తక్షణ చర్చకు విపక్షాలు డిమాండ్ చేశాయి.
తొలి 30 నిమిషాల్లోనే సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. విపక్షాల డిమాండ్ ఉంటుందని తెలిసినా.. మోదీ కావాలనే డ్రామా ప్రస్తావన చేశారనే అనుమానాలు పరిశీలకుల్లో కలిగాయి.
