
న్యూస్ డెస్క్: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురుస్తుండటంతో కృష్ణానది ప్రవాహం ఉధృతంగా మారింది. జూరాల ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో 15 గేట్లు ఎత్తివేశారు. దీంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరదనీరు చేరుతోంది.
శ్రీశైలం డ్యామ్ పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 881.60 అడుగులకు చేరింది. అలాగే గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 196.561 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశమున్నందున మరోసారి గేట్లు ఎత్తే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రాజెక్టు కుడి, ఎడమ వైపులా ఉన్న హైడెల్ పవర్ స్టేషన్ల ద్వారా నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను సమర్థంగా ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు ప్రాజెక్టు పర్యవేక్షణను కఠినంగా కొనసాగిస్తున్నారు. దాని ప్రభావం పశ్చిమ రాయలసీమ ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉంది.
